Monday, February 4, 2008

అక్షరాన్ని అధిగమించిన కవి అందెశ్రీ Eenadu News paper

అక్షరాన్ని అధిగమించిన కవి అందెశ్రీకవిత వెల్లువెత్తాలంటే కంట
తడి కావాలి! కావ్యం రాయాలంటే హృదయం ద్రవించాలి! ఇది యుగాలనాడే రుజువైన సత్యం. మట్టి పొరను చీల్చుకొని పుట్టుకొచ్చిన పాటకు పట్టాభిషేకం చేసిన అందెశ్రీ గురించి, విన్నా, చదివినా - కరకు బోయ కవిగా మారిన సంఘటనే గుర్తుకొస్తుంది. అక్షర హృదయం తెలిస్తే చాలు అక్షర స్వరూపం తెలియకపోయినా గంగిగోవు పాలలాంటి చిక్కటి కవిత్వం గుండెలోంచి పుట్టుకొస్తుందని ఆయన జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. నిరక్షరాస్యుడైన వ్యక్తి ఇతర కళల్లో రాణించవచ్చు. కానీ అక్షరాలతో పని ఉన్న కవిత్వంలో రాణించడం ఏమిటని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అది సాధ్యమే అంటున్నారీయన. పైరగాలిలో, పక్షుల గుంపులో, వాన చినుకులో, కొండవాగులో, మట్టి వాసనలో పుట్టిన సహజమైన కవిత్వం ఆయనది. నిరక్షరాస్యుడైన అందెశ్రీ పశువుల కాపరిగా... రోజు కూలీగా జీవితాన్ని ప్రారంభించారు. 'కొమ్మ చెక్కితె బొమ్మరా... కొలిచి మొక్కితె అమ్మరా..', 'చూడ చక్కని తల్లీ... చుక్కల్లో జాబిల్లి...', 'ఒడిసే చెమట చుక్కల్లోన పొడిసే పొద్దులు ఎన్నమ్మో...', 'ఎల్లిపోతున్నావా తల్లీ... నేల మసకబారిన జాబిల్లీ' లాంటి గీతాలెన్నో ఆయన నోటి నుంచి వచ్చినవే. అశువుగా చెబుతుంటే మరొకరు రాస్తుంటారు. వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ అందెశ్రీని డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ సందర్భంగా 'ఈనాడు సినిమా'తో ముచ్చటించారు.
అక్షరాలు నేర్వకపోయినా పాటను పుట్టించడంలో మీ స్ఫూర్తి ఏమిటి?
వరంగల్‌ జిల్లా రేబర్తి మా వూరు. పల్లె జీతగానిగా మొదలైంది నా బతుకు. భుక్తి కోసం అష్టకష్టాలు పడ్డాను. అందులోంచే పాట పుట్టింది. ఆచార్య బిరుదరాజు రామరాజు ప్రోద్బలంతో జానపద గీతాలపై ఆసక్తి పెరిగింది. అక్షరం నేర్చుకోకపోవచ్చు చుట్టూ ఉన్న ప్రకృతే నా పాఠశాల. ప్రజలే నా పంతుళ్లు. ఆ జీవితాలే ఎంతో నేర్పాయి. చదువు రాకపోయినా నోటికొచ్చిన రీతిలో లొల్లాయి పాటలు పాడటం చేసేవాణ్ని. వాటికి మా మామ సిద్ధయ్య అక్షరరూపమిచ్చేవారు. ఆయన తాపీ పని చేసేవారు. ఆ తరవాత మా పెద్దమ్మాయి వెన్నెల, ఆచార్య రుక్మిణి లాంటివాళ్లు కూడా నేను పాట పాడుతుంటే వాటిని అక్షరబద్ధం చేశారు.
ఎలాంటి పాటలు ఇష్టం?
ప్రకృతి అందాలు... పల్లె సౌందర్యం పాటపై ఆలోచనను రేకెత్తిస్తాయి. సామాజిక నేపథ్యంలో ఇతివృత్తాలు, కష్టాలు ఎంచుకొని ప్రజల బాణీలకు తగ్గట్టుగా పాట చెప్పడమంటే ఇష్టం.
అభ్యుదయ భావాలున్న గీతాలు మాత్రమే మీ నుంచి వస్తాయనుకోవచ్చా? అలాంటిదేమీ లేదు. యాచకుడు పాడుకొనే పాటనీ చెప్పగలను. ఆధ్యాత్మిక కీర్తననీ నా నోటి నుంచి వినొచ్చు. గేయానికి ఎన్ని లక్షణాలున్నాయో వాటన్నింటినీ నా పాటల్లో ప్రతిబింబించాను.
సినిమాల్లో బాణీకి అనుగుణంగా సాహిత్యాన్ని అందించాలి. మీకు సాధ్యమవుతుందా? సినిమా లెక్కల ప్రకారం పాట రాయడం లేదు. నా పాటల్లో చాలా వరకూ నేను బాణీ కట్టుకున్నవే. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం సంగీత దర్శకుడి బాణీలకు తగ్గట్టు నడుచుకున్నాను. అలాగే నా గేయాల కోసం సినిమాలో సందర్భాలు కూడా సృష్టించారు.
ఈ సినిమా జీవితం సంతృప్తినిస్తోందా? సినిమా పాట రాయడం అనేది నా వృత్తి కాదు. పాట నాకు ప్రాణం. ఆర్‌.నారాయణమూర్తి, యలమంచి శేఖర్‌ లాంటివారు ప్రోత్సహించారు కాబట్టి రాశాను. సినిమా అంటే నాకూ ఇష్టమే. ఆ పాటలూ నాకంటూ ఓ గుర్తింపునిచ్చాయి.
మీరు కథ, మాటలు, పాటలు రాసిన 'గంగ' విజయం సాధించలేదు. కారణం? వ్యాపార దృక్పథం కలిగిన రంగమిది. మేం ఎంచుకున్న నేపథ్యం అందుకు తగ్గట్టు లేదు. అయితే నేటి చిత్రసీమలో మంచి సినిమాలేవీ విజయవంతమైన దాఖలాలు లేవు.
నేటి సినిమా సాహిత్యంపై మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడొస్తున్న సినిమా పాట పాల పొంగులాంటిది. ఎప్పుడు పొంగి పొయ్యిని ఆర్పేస్తుందో తెలీదు. కేవలం విని ఆనందించడానికి తప్ప చిరకాలం నిలిచేలా ఉంటున్న పాటలు తక్కువే.
- మిద్దెల రంగనాథ్‌, న్యూస్‌టుడే, వరంగల్‌

2 comments:

saibaba said...

namaskaram andesri garu aim saibaba pl give your phon no iwant to meet with you my no is 9490939822 emai saibaba_tarala@yahoo.co.in

Free Softwers Download with Fullversion keys said...

Excellent article. I see how this has come to past that so that the world powers can be allowed to shift into place.
Thanks for share........
Eenadu