Wednesday, February 6, 2008

పరుగెత్తు నా పాట ప్రజలనోట Andhra Jyothy



అతడిది జిల్లా వరంగల్లు, మండలం మద్దూరు, ఊరు రేబర్తి. అంటరానింటిలో అంటరానివానిగానే పుట్టాడు.
పాడితే కంఠనాళం తెగి పడాలి. పల్లవితో అంటుకునే అగ్ని కావాలి. అంతిమ చరణం శ్రోతల్లో బడబాగ్ని పుట్టించాలి. తాను జన్మించిన నేల, తన ప్రజలు, తన సాహిత్య కళారంగం పట్ల తనదైన బాధ్యత ఉందని నమ్మే కవి అందెశ్రీ
వ్యాస వాల్మీకులను అనుకరించినవారు మార్గకవులయ్యారు. అనువదించినవారు ఆదికవులయ్యారు. స్వర్ణకంకణ భూషితులయ్యారు. గిరిజనుల్లో జానపదుల్లో భాగమై కవిత వెలయించినవారు దేశీకవులయ్యారు. చాలాసార్లు కవులు కాకుండా పోయారు. కరుడుగట్టిన సాహిత్య విలువల్ని ఛేదించడానికి కొన్ని ప్రజాస్వామిక ప్రయత్నాలు జరిగినా సఫలం కాలేదు. రాతకి - అచ్చుకి ఉన్న విలువ నోటి సాహిత్యానికి లేకుండా పోయింది. ఐనా ప్రజల తరపున అపురూపమైన మట్టి సాహి త్యం సజీవ కళగా అలరారుతూనే ఉంది. పైగా ప్రతిదశలో రాత సాహిత్యానికి చోదకశ కి ్తగా పని చేస్తున్నది.
అశేష జనబాహుళ్యాన్ని తట్టి లేపే కొత్త సాహిత్యం గరిమెళ్ళ, నాజర్‌, సుంకర, యాదగిరి, సుద్దాల హనుమంతు, తిరునగరి రామాం జనేయులు, వంగపండు, గద్దర్‌, గూడ అంజయ్యలని చిరునామాగా చేసుకుంది. నిజానికి చాలావరకు తెలుగు కవిత్వం ఇతర భాషా సాహిత్యాల అనువాదంగా కనిపిస్తుంది. తళతళలాడే, ఉట్టిపడే కొత్తదనం కనిపించని ఈ కాలంలో వినే చెవులు - చూసే కళ్ళుండాలేగాని అందెశ్రీ, గోరటి వెంకన్నల కవిత్వ జలపాతాలు, సెలయేర్లు మనల్ని విస్మయపరుస్తాయి. 1995 నుండి సాహిత్య కళారంగంలో చాలాకాలంగా వినిపిస్తూ వచ్చిన రాగాల స్థానంలో కొత్త సప్తస్వరకవితా గాన వేదికలు కొత్తగా సమాజసాహిత్య శిథిలాల నుండి బయల్పడ్డాయి.
అవి అంతకుముందు వినిపించని జనరంజనులుకనుపించని శ్రమరాగపు సింగిడీలుఊహించని అశ్వవేగపు పల్లవులుతాకని జీవితపు ఐమూలలు.

తె లుగు కవిత్వపు పాతవాసనలో నవపరిమళ వీచికలు ఇవి. కొమ్మలు దేవతా బొమ్మలైన విధం, అగ్ర ఆధిపత్య సంస్క­ృతికి బలైన ఊరు అన్నీ కొత్త బాణీలే. ఈ బాణీలు కనుపించని విల్లమ్ములు. మాయ మయ్యే మనిషిని పట్టి నిలిపిన మాంత్రిక పరుసవేదులు.నిజానికి ప్రజలే ప్రాణంగా భావించే ప్రణాళికలు, ప్రజాకళలు పనిచేయని చోట జనాన్ని నిరాశవైపు, నిస్ప­ృహవైపు పోనివ్వకుండా మనుషులని, గ్రామాల్ని, కన్నతల్లిలాంటి మూల సంస్క­ృతుల్ని నిలుపుకోవాలని విలక్షణరీతిలో పిలుపునిచ్చిన కవులు వీరే. అలాంటి ఒక పాటకు అరుదైన పురస్కారం లభించింది. ఆ పాట నిర్మాణానికి పడిన ఒడిదుడుకు లేమిటి? చూద్దాం.
ఆ పాట పేరు అందెశ్రీ.
అతడిది జిల్లా వరంగల్లు, మండలం మద్దూరు, ఊరు రేబర్తి. అంటరానింటిలో అంటరానివానిగానే పుట్టాడు. పడుతున్న సకల కష్టాలను మరిచిపోవడానికి పాటని గొణుక్కోవడం తప్ప మరేమి చేయలేక పోయాడు. ఏడో ఏట, చిరుతల అల్లీరాణి యక్షగానంలో కట్టిన వేషానికి ఆదరించిన వారే అతని ఇంటి లోని పరిస్థితుల్ని గేలి చేయడం సహించలేదు. అందెశ్రీ బతుకు జరుగుబాటులో అపశ్రుతులు. విచ్ఛిన్నమైన కుటుంబ సంబంధాలే అధికం. తల్లి బతి కి ఉన్నా అనాథ. తండ్రి ఇంట ఉన్నా అనాదరణ. పాటని గొణుగుతూ సణుగుతూ బతుకు ఈడ్చడం. రాత్రి విన్న యక్షగానాల, వేసిన కోలాటాల పాటల్లోంచి అర్థరాత్రి పొలాలకి మోటకొట్టడానికి వెళ్ళి పనిపాటలు విన్నాడు. ఆ పాటల్ని ప్రేమించాడు. ఏకసంథాగ్రాహి కావడం వల్ల బాణీ, చరణాలు అతని తోబుట్టువులయ్యాయి.
మల్లారెడ్డి సహచర్యం ఆధ్యాత్మిక చింతనకి దారివేయగా మునీరుద్దీన్‌ సేటు కుట్టిం చిన కొత్త బట్టలు వైరాగ్య విముక్తి భావన కలిగించాయి. ఈ రెండు దశల మధ్యలో మనసుకి తగిలిన గాయాలు మౌనాన్ని తట్టి లేపాయి. మౌనం ఎడ్డితనంగా భావించింది లోకం. మూగబారిన బతుకు, పౌష్టికాహారలోపం, శల్యమైన బాల్యం. ఇవీ ఆనాడు అందెశ్రీ ఎదుర్కొన్న సమస్యలు. తల్లి, ఇల్లు, ఊరు నిరాదరణలో సహజంగానే పరలోక ధ్యాస ఏర్పడింది. సన్యాస జీవితంవైపు లాలస. నిరాశ. వీటిమధ్య సుద్దాల రాసిన 'పల్లెటూరి పిల గాడా / పాలబుగ్గల జీతగాడా' పాట, గద్దర్‌ రాసిన 'దుక్కిదున్ని దుక్కిదున్ని బొక్కలిరిగెనా/మాయన్నా జీతగాడ/వొరం చెక్కి వొరం చెక్కి/వొరిగిపోతివా' అనేపాట అనాడు తాను గడుపుతున్న జీవితానికి అద్దం పట్టాయి.
తనకి తెలియ కుండానే తానుకూడా తన బతుకుని అలాంటి రాగాలలోకి మార్చడానికి ప్రయ త్నం చేశాడు. బొమ్మల పెళ్ళిలా జరిగిన బాల్య వివాహం, చేదు అనుభవం మిగిల్చిన కాపురం కాని కాపురం. మళ్ళీ కుటుంబం శత్రువులా మారిన వైనం. అలాకాకుండా బతుకు బయళ్ళలో మాత్రం అంతా పచ్చదనమే. ఇంటిని మరవడానికి ఊరు దగ్గరైంది. అందుకే కనిపెంచిన ఊరు నా కమనీయ జ్ఞాపకం అంటాడు. ఆధ్యాత్మిక గీతాలు, భజన పాటల కన్నా బతుకు పల్లవులే ఆసరా ఇచ్చాయి. అటు తురకల గోరీలు, ఇటు మాదిగల బొందలు, మాలల సమాధులు వీటి మధ్య మునీర్‌ సేటు వ్యవసాయ బాయి. ఈ బాల కార్మికుడు. పాలబుగ్గల జీతగాడు. గడ్డపారతో తవ్వుతుంటే పాదం చిల్లుపడింది. ఆర్నెల్లు సల పరం. అణా మందెందుకు దండగ అన్న తండ్రి. చిన్నాన్న ఆగయ్య చిన్నమెత్తు సహకారం ఒక జ్ఞాపకం. ఆ కష్టాల కాలంలో అను పల్లవి స్వాంతన పరిచింది. పాట ప్రవాహం అయింది. గొంగళి పురుగుకి రెక్కలు వస్తేనే కదా సీతాకోకచిలుక. పాటలు నాకు రెండు రెక్కలై మొలిచాయి అంటాడు.
గాయం మానుతున్న కొద్దీ గేయానికి దగ్గరైంది అందెశ్రీ మానసిక జీవితం.
బావతో కలసి నిజామాబాదుకి కూలీగా వలస వెళ్ళాడు. కూలీగా, మేస్త్రీగా పని చేయడంవల్ల అర చేతులనిండా పొక్కులు. ఆహారలేమి వల్ల దృష్టి బలహీనత. బతుకుని గెలవగలనని భరోసా ఇచ్చింది తాపీమేస్త్రీ పని. అప్పుడు రోజుకి పదమూడు రూపాయల కూలి. అప్పుడే శంకర్‌ మహారాజ్‌ సహచర్యం. అతనో ఆధ్యాత్మిక గురువు. నిత్యం ఉపనిషత్తులు, వేదాంగ పఠనం అక్కడ. అతని బోధలవల్ల పెరిగింది కొద్ది దార్శనికత, కొంత ఆధ్యాత్మిక చింతన. చిన్న స్వామిగా గుర్తింపు వచ్చింది. కాని ఈ స్వామికి కళ్ళ ముందు జోగినుల లైంగిక దోపిడి కనిపించింది.
రెండు గ్లాసుల టీ మరకలు గగుర్పొడిచాయి. ఎందుకు స్వామీ ఈ తేడాలు - ఆధ్యాత్మిక ఔన్నత్యం పక్కనే మానవ అధమ దౌర్జన్యం? బుద్ధుడు, కారల్‌మార్క్స్‌, వివేకానందుడు, అంబేద్కర్‌ అందరూ కలిసి కూడా విప్పలేని పజిల్‌ని ఏ స్వామీజీ అయినా చెప్ప గలడా? అప్పటినుండి దాన్ని విప్పి చెప్పడానికొక బాణీని వెదకడమే అతని పనయింది. కృషి అయింది. కొన్నిరోజుల తరువాత మహారాజ్‌ గురువుగారు యజ్ఞం చేయాలని భావించాడు. రుత్వికుడిగా చిన్న స్వామిని కూర్చోబెడితే తామెవరం పాల్గొనమన్నారు ఆరువందల మంది శిష్యులు. జందెం లేకపోతే జందెం వేస్తాను. మంత్రోచ్ఛాటనలతో ఉపనయనం చేస్తానన్నాడు. కులం లేకపోతే దత్తత తీసుకుంటానన్నాడు. స్వామి ఆధ్యాత్మికత ఏమోగాని మనిషిగా మహావ్యక్తి. మంచి వ్యక్తిగా మారడానికి ఆధ్యాత్మికం కూడా అవసరమా అని సందే హిస్తాడు అందెశ్రీ.
భజన భజంత్రీల పాటలు వద్దుఎంగిలి పాటలు రాయకునీవు చూసిన బతుకుపాటలు రాయినీకై నీవె కైకట్టు - మనసుపెట్టి.
అని చేసిన మహారాజ్‌ గురువు బోధ అతనికి మార్గదర్శకమైంది. అప్పటి వరకు అతని బతుకు చుట్టూ ఆవరించిన జానపద పాటకన్నా భిన్నమైన ఎత్తుకలిగిన పాటే మిన్న అనే భావన పటాపంచలైంది. ఐతే కొత్త పాట ఎలా ఎక్కడ ఉంది. దాన్ని పట్టుకోవడం సాధ్యమా? ఏది మార్గం? అని అనుకున్నాడు. వేమన, కుమ్మరి సిద్ధప్ప రాసిన పద్యాలు బాగా ఆకట్టుకున్నాయి. వాటితీరులో వందలాది పద్యాల రచన చేశాడు.
భూమ్మీద స్కైలాబ్‌ పడబోయే సమయంలో నిజామాబాదు నుండి హైదరాబాదు చేరా డు. వరంగల్‌ జిల్లాలో పుట్టిన అందెశ్రీ పాట మాత్రం నిజామాబాద్‌లో ఉండగా పురుడుపోసుకుంది. కొత్తపాట కోసం తపన. నిరంతరం వెదుకులాట. ఆ కాలంలోనే ఉద్యమాలతో చుట్టరికం కలిసింది. పొద్దంతా మేస్త్రీపని. రాత్రంతా సభలు, సమావేశాల్లో పాటలు వినే పని. తొమ్మిదేళ్ళు అవిశ్రాం తంగా పని..పని...ఉద్యమాలు నాలాంటి కష్టజీవులకోసమే కదా. అందులో పనే. అక్కడా లెక్కలేనంత పనే. పనిచేయని వాళ్ళు అక్క డ అదలిస్తారు.
బెత్తం పట్టుకున్నట్లు కనబడింది వాళ్ళ స్వభావం నాకు అంటాడు. ఈ సమయంలోనే నన్నయ నుండి గద్దర్‌ వరకు సాహిత్య అన్వేషణ ఆరంభించాడు. యెల్దండ కేంద్రంగా ఒక జన సంఘం వచ్చింది. ఇది వాళ్ళ ఊరికి రెండు మైళ్ళ దూరంలో ఉన్న బైరాన్‌పల్లినాటి తెలంగాణా రైతాంగ పోరాట కాలంనాటి సంఘం కాదు. ఇది కొత్త పాటల జాతర. కాముని పున్నమినాడు ఊరి అడు గుభాగాన పదిమందితో కలిసి పాడినపాట. 'ఊరు మనదిరో/ వాడ మనదిరో/దొర ఏందిరో/దొరతనం ఏందిరో' పాట పాటకాదు. అది ఊరిలోని తొంభై శాతం ప్రజల మనోద్వేగ సామూహిక నినాదం. బతుకు అతని ముందు జలపాతాన్ని నిలిపింది. దాన్ని దాటి ప్రయా ణించాలి. పాట రాస్తే కొత్తగా ఉండాలి.
పాడితే కంఠనాళం తెగి పడాలి. పల్లవితో అంటుకునే అగ్ని కావాలి. అంతిమ చరణం శ్రోతల్లో బడబాగ్ని పుట్టించాలి. ఆనాటి కవిత్వయుగంలో కనిపించేవన్నీ కొండ కోనలపై మెరిసే మరఫిరంగులే. అలాంటి కవుల కన్నా భిన్నంగా రాయడం ఎలా? మేస్త్రీగా ఉన్నప్పుడు చదువుకున్న విజ్ఞులు నేస్తాలయ్యారు. ఎన్న టికీ మరువరాని పెద్దలెందరో ఉన్నారు. అందరూ అతని కవిత్వ ఇంధ్రధనువుకి ఏడురంగులు అద్దారు. ముఖ్యంగా తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులు. అలసి సొలసివస్తే తాము తినే అన్నాన్ని పెట్టారు. తాము తాగే నీళ్ళిచ్చారు. పడుకునే ఇరుకు మంచంపై కాస్తంత చోటిచ్చారు. అపుడు ఆకలి తీరింది కాబట్టే పాటలపై దృష్టి మర లింది. 'పాటలపూదోట'లో గేయాలు, 'అందెల సందడిల'లో వచన కవిత్వం ఉంది. అయినా అతనిలో అసంతృప్తి. అప్పుడు ఆలోచనలు రేపిన కలాలు ఉన్నాయి.
ప్రోత్సా హం నింపిన నేస్తాలు ఉన్నారు. అభయహస్తం ఇచ్చినవారు, పాటల జనజాతరలు ఎన్నెన్నో దాగి ఉన్నాయి. తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యుల సహవాసంతో పాట కోసం పరిశోధన చేపట్టాడు. పరిశోధించి పాటని సిద్ధాంతవ్యాసం చేశాడు. పాట, పరి శోధన పని కలిపి తాత్విక చింతనగా మార్చాడు. జనహిత మార్గంలో పాటల్ని తన వంతు కార్యకర్తలుగా చేశాడు. వందలకొద్దీ పాటలు రాయాలని కాదు. ఒక చరణం వేలాది ప్రజల చిరునామా కావాలన్నదే అతని ధ్యేయం. తాను జన్మించిన నేల, తన ప్రజలు, తన సాహిత్య కళారంగంపట్ల తనదైన బాధ్యత ఉందని నమ్మే విలక్షణ కవి అందెశ్రీ. అనువాదం చేస్తే ఆదికవి అనవచ్చు. కాని అనుకరణ చేసే ఏలాంటి కవినైనా ప్రజలు తిరస్కరిస్తారు అంటాడు. జానపదాలను తక్కువగా చూసి అది తప్పని తెలు సుకున్నాడు. ఆ ప్రజల పాటలే తన పాటలకింత ఔన్నత్యం కలిగించాయని అంటాడు.
పసుల కాసే పిల్లగాడికి ఏ భీమ్‌సేన్‌ జోషికి, మంగళం పల్లికి, ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మికి దక్కని దత్తపీఠం, గౌరవం, స్వర్ణకంకణం, లక్ష రూపాయల సత్కారం అందెశ్రీకి దక్కిందంటే ప్రజల పాటలకున్న శక్తే అని ఆయన అభిప్రాయపడతాడు. మార్గనుండి లలిత, దేశీ నుండి జనం బాణీల్లోకి చేసిన యాత్రలో అతను ఆస్తికు డూకాదు నాస్తీకుడూ కాదు. అతని పాటలు ఏవీ ఇలాంటి ఏ భావజాలాన్ని సమర్థిం చవు. నిజానికి నాకు దైవం మీద నమ్మకం కన్నా ప్రకృతిమీద గౌరవం అధికం. కను పించని దైవభావన కన్నా ముందున్న మట్టిమానవుల సాహిత్యానికీ, వారి మాండలిక భాషకు-వీటికి మూలమైన పల్లెకీ వినమ్రంగా దండం పెడతా నంటాడు.
ఒక మతంలోనో, ఒక కులంలోనో జీవించవలసి రావడం దురదృష్టం. దాన్ని నిరాకరించడమే నా అభిమతం. అదే నా అస్థిత్వం అని స్పష్టంగా ప్రకటిస్తాడు. 'ఈ లోకం నీ ఇల్లు జన మంతా నా వాళ్ళు' అని అనుకోని వారితో పేచీ పడతాడు. తన గేయాలతో వారికి గాయాలైనా ఎదుర్కొంటానని ప్రతిజ్ఞ చేశాడు. ఆధ్యాత్మికత పై కాలు పెట్టి అసమానతల ధిక్కారంవైపు నా పల్ల వుల దండుని నడుపుతానంటాడు. పల్లె పాఠశాలలో నేర్చిన విద్యార్థి జనం వైపుంటాడు. జనానికి దూరమైన ఎలాంటి విష యాన్నైనా ఖండిస్తాడు. అలాంటి అందెశ్రీని ఒక ప్రశ్న అడిగితే - ఆనాడు నేను అంటరానివాడిని. యజ్ఞంలో రుత్వికుడిగా కూర్చో బెట్టినందుకు గర్వించాను. కాని నష్కల్‌లో దళిత కళారూపాలపై ప్రదర్శనలు జరిగిన సందర్భంలో అంటరాని వాళ్ళకు అంట రానివారైన డక్కలివాళ్ళ గుడిసెలో భోజనం చేసినందుకు ఎంతో గర్విస్తాను.
దాంతో తరతరాల పాప ప్రక్షాళన చేసుకున్నానని విస్పష్టంగా ప్రకటించాడు. వ్యాపార సినిమా నటులకు, వ్యాపార సంస్థల అధిపతులకు డాక్టరేట్‌ పట్టాల పందేరం జరిగే ఈ కాలంలో ప్రజాకవికి ఈ సన్మానం చేయడం వింతే. విశ్వవిద్యాలయాలు రాత సాహిత్యానికి పట్టం కడతాయనే అనుకుంటారు. శుష్క పాండిత్యానికే గౌరవమర్యాదలు ఇస్తాయనే అనుకుంటారు. కాని కాకతీయ విశ్వవిద్యాలయం ఒక నిరక్షరాస్య కవికి గౌరవ డాక్టరేట్‌ ఇచ్చి తనని తాను వంద గౌరవ డాక్టరేట్లతో గౌరవించుకుంది. జానపదగేయకవిని గుర్తించడానికి ప్రజాస్వామ్యదశలో కూడా సాధ్యపడని పరిస్థితులున్నాయి. వాటిని అధిగమించి కాకతీయ విశ్వవిద్యాలయం కొత్త వరవడిని సృష్టించింది. అందెశ్రీని గౌరవించడం అంటే తెలంగాణ ప్రాంత ప్రజా కవిత్వానికి జానపద కళా సంస్క­ృతులకి పట్టం కట్టడమే.
- జయధీర్‌

Monday, February 4, 2008

అక్షరాన్ని అధిగమించిన కవి అందెశ్రీ Eenadu News paper

అక్షరాన్ని అధిగమించిన కవి అందెశ్రీకవిత వెల్లువెత్తాలంటే కంట
తడి కావాలి! కావ్యం రాయాలంటే హృదయం ద్రవించాలి! ఇది యుగాలనాడే రుజువైన సత్యం. మట్టి పొరను చీల్చుకొని పుట్టుకొచ్చిన పాటకు పట్టాభిషేకం చేసిన అందెశ్రీ గురించి, విన్నా, చదివినా - కరకు బోయ కవిగా మారిన సంఘటనే గుర్తుకొస్తుంది. అక్షర హృదయం తెలిస్తే చాలు అక్షర స్వరూపం తెలియకపోయినా గంగిగోవు పాలలాంటి చిక్కటి కవిత్వం గుండెలోంచి పుట్టుకొస్తుందని ఆయన జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. నిరక్షరాస్యుడైన వ్యక్తి ఇతర కళల్లో రాణించవచ్చు. కానీ అక్షరాలతో పని ఉన్న కవిత్వంలో రాణించడం ఏమిటని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అది సాధ్యమే అంటున్నారీయన. పైరగాలిలో, పక్షుల గుంపులో, వాన చినుకులో, కొండవాగులో, మట్టి వాసనలో పుట్టిన సహజమైన కవిత్వం ఆయనది. నిరక్షరాస్యుడైన అందెశ్రీ పశువుల కాపరిగా... రోజు కూలీగా జీవితాన్ని ప్రారంభించారు. 'కొమ్మ చెక్కితె బొమ్మరా... కొలిచి మొక్కితె అమ్మరా..', 'చూడ చక్కని తల్లీ... చుక్కల్లో జాబిల్లి...', 'ఒడిసే చెమట చుక్కల్లోన పొడిసే పొద్దులు ఎన్నమ్మో...', 'ఎల్లిపోతున్నావా తల్లీ... నేల మసకబారిన జాబిల్లీ' లాంటి గీతాలెన్నో ఆయన నోటి నుంచి వచ్చినవే. అశువుగా చెబుతుంటే మరొకరు రాస్తుంటారు. వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ అందెశ్రీని డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ సందర్భంగా 'ఈనాడు సినిమా'తో ముచ్చటించారు.
అక్షరాలు నేర్వకపోయినా పాటను పుట్టించడంలో మీ స్ఫూర్తి ఏమిటి?
వరంగల్‌ జిల్లా రేబర్తి మా వూరు. పల్లె జీతగానిగా మొదలైంది నా బతుకు. భుక్తి కోసం అష్టకష్టాలు పడ్డాను. అందులోంచే పాట పుట్టింది. ఆచార్య బిరుదరాజు రామరాజు ప్రోద్బలంతో జానపద గీతాలపై ఆసక్తి పెరిగింది. అక్షరం నేర్చుకోకపోవచ్చు చుట్టూ ఉన్న ప్రకృతే నా పాఠశాల. ప్రజలే నా పంతుళ్లు. ఆ జీవితాలే ఎంతో నేర్పాయి. చదువు రాకపోయినా నోటికొచ్చిన రీతిలో లొల్లాయి పాటలు పాడటం చేసేవాణ్ని. వాటికి మా మామ సిద్ధయ్య అక్షరరూపమిచ్చేవారు. ఆయన తాపీ పని చేసేవారు. ఆ తరవాత మా పెద్దమ్మాయి వెన్నెల, ఆచార్య రుక్మిణి లాంటివాళ్లు కూడా నేను పాట పాడుతుంటే వాటిని అక్షరబద్ధం చేశారు.
ఎలాంటి పాటలు ఇష్టం?
ప్రకృతి అందాలు... పల్లె సౌందర్యం పాటపై ఆలోచనను రేకెత్తిస్తాయి. సామాజిక నేపథ్యంలో ఇతివృత్తాలు, కష్టాలు ఎంచుకొని ప్రజల బాణీలకు తగ్గట్టుగా పాట చెప్పడమంటే ఇష్టం.
అభ్యుదయ భావాలున్న గీతాలు మాత్రమే మీ నుంచి వస్తాయనుకోవచ్చా? అలాంటిదేమీ లేదు. యాచకుడు పాడుకొనే పాటనీ చెప్పగలను. ఆధ్యాత్మిక కీర్తననీ నా నోటి నుంచి వినొచ్చు. గేయానికి ఎన్ని లక్షణాలున్నాయో వాటన్నింటినీ నా పాటల్లో ప్రతిబింబించాను.
సినిమాల్లో బాణీకి అనుగుణంగా సాహిత్యాన్ని అందించాలి. మీకు సాధ్యమవుతుందా? సినిమా లెక్కల ప్రకారం పాట రాయడం లేదు. నా పాటల్లో చాలా వరకూ నేను బాణీ కట్టుకున్నవే. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం సంగీత దర్శకుడి బాణీలకు తగ్గట్టు నడుచుకున్నాను. అలాగే నా గేయాల కోసం సినిమాలో సందర్భాలు కూడా సృష్టించారు.
ఈ సినిమా జీవితం సంతృప్తినిస్తోందా? సినిమా పాట రాయడం అనేది నా వృత్తి కాదు. పాట నాకు ప్రాణం. ఆర్‌.నారాయణమూర్తి, యలమంచి శేఖర్‌ లాంటివారు ప్రోత్సహించారు కాబట్టి రాశాను. సినిమా అంటే నాకూ ఇష్టమే. ఆ పాటలూ నాకంటూ ఓ గుర్తింపునిచ్చాయి.
మీరు కథ, మాటలు, పాటలు రాసిన 'గంగ' విజయం సాధించలేదు. కారణం? వ్యాపార దృక్పథం కలిగిన రంగమిది. మేం ఎంచుకున్న నేపథ్యం అందుకు తగ్గట్టు లేదు. అయితే నేటి చిత్రసీమలో మంచి సినిమాలేవీ విజయవంతమైన దాఖలాలు లేవు.
నేటి సినిమా సాహిత్యంపై మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడొస్తున్న సినిమా పాట పాల పొంగులాంటిది. ఎప్పుడు పొంగి పొయ్యిని ఆర్పేస్తుందో తెలీదు. కేవలం విని ఆనందించడానికి తప్ప చిరకాలం నిలిచేలా ఉంటున్న పాటలు తక్కువే.
- మిద్దెల రంగనాథ్‌, న్యూస్‌టుడే, వరంగల్‌